ఫొటోనిక్స్ రంగంలో సహకరించండి..నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌‌‌‌తో మంత్రి శ్రీధర్బాబు భేటీ

ఫొటోనిక్స్ రంగంలో సహకరించండి..నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌‌‌‌తో మంత్రి శ్రీధర్బాబు భేటీ

హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో అధునాతన ఫొటోనిక్‌‌‌‌ ప్యాకేజింగ్‌‌‌‌, కో-ప్యాకేజ్డ్‌‌‌‌ ఆప్టిక్స్‌‌‌‌ లాంటి తదుపరి తరం సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకు అనుగుణంగా నిపుణులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో కలిసి సమగ్ర కార్యచరణ ప్రణాళికను రూపొందించడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించామని తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్‌‌‌‌లో నీతి ఆయోగ్‌‌‌‌ సభ్యుడు డాక్టర్​ వీకే సారస్వత్‌‌‌‌ .. శ్రీధర్​బాబుతో సమావేశమయ్యారు.

సిలికాన్​ ఫొటోనిక్స్​రంగంలో ఉన్న అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకునేలా ‘తెలంగాణ సిలికాన్‌‌‌‌ ఫొటోనిక్స్‌‌‌‌ మిషన్‌‌‌‌’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను  రూపొందించడంపై చర్చించారు. ఫొటోనిక్స్‌‌‌‌ వ్యాలీ కార్పొరేషన్‌‌‌‌ భవిష్యత్‌‌‌‌ కార్యాచరణ, ఇండియా సెమీకండక్టర్‌‌‌‌ మిషన్‌‌‌‌–2.0తో తెలంగాణ సిలికాన్‌‌‌‌ ఫొటోనిక్స్‌‌‌‌ మిషన్‌‌‌‌ ను అనుసంధానించేందుకు ఉన్న అవకాశాలపైనా చర్చించారు. సిలికాన్‌‌‌‌ ఫొటోనిక్స్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ అభివృద్ధి చేయడం, డిజైన్‌‌‌‌, పరిశోధన, తయారీ, ప్యాకేజింగ్‌‌‌‌, టెస్టింగ్‌‌‌‌, సరఫరా వ్యవస్థలను అనుసంధానించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఫొటోనిక్స్‌‌‌‌, క్వాంటం కంప్యూటింగ్‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అడ్వైజరీ కౌన్సిల్‌‌‌‌కు నేతృత్వం వహించాలని  కోరారు. కాగా, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీకే సారస్వత్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు తనవంతు సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తానన్నారు.